కట్టెదుర వైకుంఠము
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
హిందోళరాగం , ఆదితాళం
Audio
పల్లవి :
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టెలాయ మహిమలే తిరుమల కొండా తిరుమల కొండ
తిరుమల కొండా …...తిరుమల కొండ
చరణం :
వేదములే శిలలై వెలసినది కొండ
యేదెస పుణ్యరాసులే యేరులైనది కొండ
గాదిలి బ్రహ్మది లోకముల కొనల కొండ.
శ్రీదేవుడుండేటి శేషాద్రీకొండ
…..కట్టెదుర….
సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ
నిర్వహించి జలధులే నిట్ట చరులైన కొండ
వుర్వి దపసులే తరువులై నిలచిన కొండ
పూర్వపుటంజనాద్రి పొడవాటి కొండ
…..కట్టెదుర….
వరములు కొటారుగా వక్కాణించి పెంచే కొండ
పరగు లక్ష్మీకాంతు సోబనపు కొండ
కురిసిన సంపదలెల్ల గుహల నిండిన కొండ
విరివైనదిదివో శ్రీవేంకటపుకొండా…
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టెలాయ మహిమలే తిరుమల కొండా తిరుమల కొండ
తిరుమల కొండా …...తిరుమల కొండ
తిరుమల కొండా …...తిరుమల కొండ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి